అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న నూతన సుంకాల నిర్ణయం స్వదేశంలోనే తీవ్ర వివాదాస్పదమవుతోంది. భారత్‌తో సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాలపై విధించిన కొత్త పన్నులను సవాలు చేస్తూ.. అమెరికాలోని 25 డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తమ చట్టబద్ధమైన అధికార పరిమితులను దాటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ న్యూయార్క్‌లోని ‘యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో ఈ రాష్ట్రాల కూటమి పిటిషన్ దాఖలు చేసింది.
అదనపు టారిఫ్‌లు..
వెట్టి చాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు కావడం లేదనే కారణంతో గత నెలలో ట్రంప్ ప్రభుత్వం ఈ సుంకాల విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా భారత్ వంటి దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త పన్నుల వల్ల దేశంలో సాధారణ వినియోగదారులు, వ్యాపార వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని 25 రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలొనూ ట్రంప్ తీసుకున్న పలు సుంకాల నిర్ణయాలు కోర్టుల్లో సవాళ్లను ఎదుర్కొన్న నేపథ్యంలో.. తాజా కేసు ఆయన వాణిజ్య విధానాలకు మరో పెద్ద పరీక్షగా మారింది.
కాగా, ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు. మరోవైపు చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులతో పాటు యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోని వస్తువులకు ఈ కొత్త పన్నుల నుంచి మినహాయింపు కల్పించారు.
