పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌ను దారికి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాలపై దృష్టి సారించారు. అమెరికా ప్రతిపాదించిన షరతులకు ఇరాన్ అంగీకరించకపోవడంతో, టెహ్రాన్‌ను లొంగదీసుకునేందుకు వినూత్న, సంప్రదాయేతర మార్గాలను అన్వేషించాలని తమ సైనిక బలగాలను ట్రంప్ ఆదేశించినట్లు సమాచారం.
గతంలో తీవ్ర హెచ్చరికలు ..
ఇరాన్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులు చేస్తామని గతంలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జోక్యం చేసుకోవడం, అలాగే యూఏఈ, ఖతార్ వంటి దేశాల నుంచి దౌత్యపరమైన అభ్యర్థనలు రావడంతో భీకర దాడుల నిర్ణయాన్ని ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టారు.
ఇరాన్‌కు ఇది ‘చివరి అవకాశం’..
అయినప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తన వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని, ఒప్పందానికి రావడానికి ఇరాన్‌కు ఇది ‘చివరి అవకాశం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దౌత్య మార్గాన్ని ఇరాన్ సద్వినియోగం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
