అమెరికాలో ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులన్నీ ఇకపై తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే సమర్పించాలనే నిబంధనను తీసుకురావడానికి అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల శాఖ (USCIS) సిద్ధమైంది. గ్రీన్ కార్డ్, పౌరసత్వం, ఆశ్రయం (Asylum), ఉపాధి అనుమతులు వంటి పలు రకాల ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం ఈ విధానం వర్తించనుంది. కార్యకలాపాల వ్యూహాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
డిజిటల్ ఫైలింగ్..
ఫెడరల్ రిజిస్టర్లో సోమవారం ప్రచురించబడిన కొత్త నిబంధన ప్రకారం.. గత 180 రోజులుగా ఆన్లైన్ ఫైలింగ్‌కు అందుబాటులో ఉన్న ఏ ఫారమ్నైనా ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సమర్పించడం తప్పనిసరి అవుతుంది. అంతేకాకుండా, కనీసం 60 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి ఆయా ఫారమ్‌లను కేవలం ఆన్లైన్ మోడ్‌లోకి మార్చే అధికారాన్ని కూడా ఈ నిబంధన కల్పిస్తోంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులు, పునరుద్ధరణలు, కుటుంబ ఆధారిత పిటిషన్లు, పౌరసత్వ అభ్యర్థనలు, శరణార్థుల దరఖాస్తులు , తాత్కాలిక రక్షిత హోదా (TPS) ఫైలింగ్లన్నీ ఈ రూల్ పరిధిలోకి వస్తాయి.
నిర్వహణ ప్రయోజనాలు..
దరఖాస్తుదారులు యూఎస్సీఐఎస్ ఆన్లైన్ ఖాతా ద్వారా నేరుగా ఫారమ్‌ను పూర్తి చేయడం లేదా పూర్తి చేసిన ఫారమ్ యొక్క పీడీఎఫ్ వెర్షన్‌తో పాటు సహాయక పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. పేపర్ ఆధారిత ప్రాసెసింగ్ నుంచి డిజిటల్ విధానానికి మారడం, ట్రెజరీ డిపార్ట్మెంట్ లాక్బాక్స్ సర్వీస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ చర్య ప్రధాన లక్ష్యమని ఏజెన్సీ పేర్కొంది. ఈ-ఫైలింగ్ ద్వారా మరింత వేగవంతమైన సేవలు అందడంతోపాటు, తప్పులు తగ్గుతాయని, ఇమిగ్రేషన్ డేటాను సులువుగా విశ్లేషించడం ద్వారా భద్రతా తనిఖీలు , మోసాల గుర్తింపు మరింత బలపడుతుందని అధికారులు వెల్లడించారు.
మినహాయింపులు ..
ఒకవేళ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు.. ప్రత్యేకంగా ఒక కొత్త ఫారమ్‌ను సమర్పించి మినహాయింపు (Exemption) కోరవచ్చు. ఈ అభ్యర్థనలను యూఎస్సీఐఎస్ పరిశీలించి ఒక్కో కేసుకు తగినట్లుగా మినహాయింపు మంజూరు చేస్తుంది. అయితే, ఈ మినహాయింపు కోసం దరఖాస్తుదారులు 25 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో యూఎస్సీఐఎస్ దాదాపు 14 మిలియన్లకు పైగా బెనిఫిట్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగా, లాక్బాక్స్ సౌకర్యాలు సుమారు 453 మిలియన్ల పేపర్ సబ్మిషన్ పేజీలను హ్యాండిల్ చేశాయి. కేవలం లాక్బాక్స్ సిస్టమ్ నిర్వహణ కోసం సుమారు 396 మిలియన్ డాలర్లు, పోస్టేజ్ ఖర్చుల కింద మరో 10 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మాన్యువల్ హ్యాండిలింగ్, డేటా ఎంట్రీ, షిప్పింగ్, స్టోరేజ్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అప్లికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడానికే ఈ కఠిన నిబంధనను తెచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) స్పష్టం చేసింది.
