అమెరికాలో పౌరసత్వం పొందడమే లక్ష్యంగా కొందరు చేసే ‘బర్త్ టూరిజం’పై అమెరికా ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ గర్భిణులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కేవలం జులై నెలలోనే దాదాపు 600 మంది గర్భిణుల వీసాలను అమెరికా రద్దు చేసినట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వెల్లడించారు. వీసాలు రద్దయిన మహిళల్లో ఎక్కువ మంది గర్భధారణ చివరి దశ అనగా 9వ నెలలో అమెరికాకు చేరుకున్నవారే కావడం గమనార్హం.
అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి అక్కడి పౌరసత్వం సంపాదించాలనే ఉద్దేశంతోనే వీరు వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘బర్త్ టూరిజం టాస్క్ ఫోర్స్’ రంగంలోకి దిగి వీసాలను సమీక్షించి రద్దు చేస్తోంది.
కఠిన నిబంధనలు..
అమెరికాలో వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రయాణ ఉద్దేశాలపై అనుమానం ఉన్న దరఖాస్తుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ నిబంధనల ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై కూడా పడుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాల్ సీజన్లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 1.12 లక్షలు తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇకపై అమెరికా వీసా దరఖాస్తుదారులు మరింత కఠిన తనిఖీలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
