మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. అయ్యప్ప స్వామి మాలలో రవితేజ కనిపించడం, ట్రైలర్ విడుదల కావడం వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ మధ్యకాలంలో రవితేజ ఇతర సినిమాలకు లేని విధంగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రీమియర్స్ పూర్తికాగా, సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
అమెరికా ప్రీమియర్స్ నుంచి సానుకూల స్పందన:
అమెరికా నుంచి వస్తున్న రివ్యూల ప్రకారం.. ఇదొక సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదని, సామాజిక బాధ్యతతో కూడిన చిత్రమని ఎన్నారై ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కథనుంచి బయటకు వెళ్లకుండా దర్శకుడు శివ నిర్వాణ, హీరో రవితేజ చాలా నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచించాల్సిన విధంగా, వారి పేరెంటింగ్ స్టైల్ మార్చుకునేలా ఈ సినిమా ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఉత్కంఠభరితమైన ప్రథమార్థం:
సినిమాలో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు ఫస్టాఫ్‌లో తండ్రి-కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు చాలా ఉత్కంఠభరితంగా నడిపించారని టాక్. తండ్రీకొడుకుల మధ్య బంధం, అమ్మాయిలను ఎలా పెంచాలనే విషయంలో సాయికుమార్ చెప్పే డైలాగులు, సస్పెన్స్ , థ్రిల్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తున్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
భావోద్వేగాలతో ద్వితీయార్థం , క్లైమాక్స్:
‘ఇరుముడి’ మొదటి భాగం ఉత్కంఠగా సాగితే, సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ డ్రామాతో ముందుకు సాగుతుంది. సినిమాలో వచ్చే ఒక కీలకమైన ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్‌కు భిన్నంగా ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాను ముగించి దర్శకుడు శివ నిర్వాణ విజయం సాధించారని అంటున్నాయి వర్గాలు. ఈ సినిమాకు సంగీతం అదనపు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్‌లో వచ్చే ‘మల్లెపూల పల్లకి’ పాట వస్తున్నప్పుడు థియేటర్లలో విజిల్స్ పడటం గ్యారెంటీ అని చెబుతున్నారు. మొత్తంగా రవితేజ మీద మరింత గౌరవం పెంచే చిత్రంగా ‘ఇరుముడి’ నిలుస్తోందని ప్రీమియర్ టాక్ స్పష్టం చేస్తోంది.
