కెనడా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. తమ దేశ ఉత్పట్లపై అమెరికా విధిస్తున్న సుంకాలకు దీటుగా కెనడా కూడా ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. అమెరికన్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు టారిఫ్లను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సుంకాలు వచ్చే నెల (సెప్టెంబర్) 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
సుంకాల పెంపు , ప్రభావిత వస్తువులు..
టొరంటో కేంద్రంగా వెలువడిన సమాచారం ప్రకారం.. ఉక్కు, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలతో పాటు సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై కెనడా మంగళవారం ఈ ప్రతికార సుంకులను ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్లు కేవలం పారిశ్రామిక వస్తువులకే పరిమితం కాకుండా, సముద్రపు ఆహారం, చీజ్, దుస్తులు, సౌందర్య సాధనాలు, టాయ్లెట్ పేపర్ వంటి నిత్యం వినియోగించే వస్తువులపై కూడా ప్రభావం చూపనున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 15 శాతం, 25 శాతం, 50 శాతం రేట్లతో ఈ సుంకాలు దశలవారీగా అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు పల్ప్, కాగితం, ఎలక్ట్రానిక్స్ తదితర 700లకు పైగా అమెరికన్ ఉత్పత్తులపై ఈ టారిఫ్లు వర్తించనున్నాయి.
కెనడా లక్ష్యాలు , ఉద్దేశాలు..
తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, కెనడియన్ కంపెనీలను రక్షించడం, అమెరికా నుంచి దిగుమతులను తగ్గించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కెనడా అధికారులు స్పష్టం చేశారు. అమెరికాతో నెలకొన్న టారిఫ్ వివాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన కార్మికులు, వ్యాపార వర్గాల కోసం కెనడా ప్రభుత్వం 5.4 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన సహాయ ప్యాకేజీని కూడా ప్రకటించింది. మరోవైపు, అమెరికా అనుసరిస్తున్న తీరుపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడాను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన, వాణిజ్య చర్చల సమయంలో అమెరికా పెట్టిన షరతులు సరికాదని, కెనడా పరిశ్రమలను దెబ్బతీయాలనేదే వారి కుట్ర అని విమర్శించారు.
ఒంటారియో సరస్సు పేరు మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలు..
ఇరు దేశాల మధ్య వివాదం ముదురుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భూభాగంలోని ‘ఒంటారియో సరస్సు’ పేరును ‘అమెరికా సరస్సు’గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గతంలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి ఒంటారియో సరస్సుపై పడినట్లు స్పష్టమవుతోంది.
