ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఫిలిం నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఏకంగా త్రిపాత్రాభినయంలో (మూడు పాత్రల్లో) కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కథ ప్రకారం ఇందులో ఒక తండ్రి పాత్రతో పాటు, ఇద్దరు కొడుకుల పాత్రల్లోనూ బన్నీ నటించనున్నట్లు తెలుస్తోంది. తండ్రి పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయగా.. ఇద్దరు కొడుకుల పాత్రలు పూర్తిగా భిన్నమైన మేనరిజమ్స్‌తో సాగుతాయని సమాచారం. అట్లీ గత చిత్రాలైన ‘అదిరింది’, ‘జవాన్’ సినిమాల్లోనూ హీరోలను ద్విపాత్రాభినయాల్లో చూపించారు.
ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోయే ఈ విజువల్ వండర్‌లో మూడు విభిన్న గెటప్‌లలో బన్నీ వేరియేషన్స్ చూపించబోతున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటివరకు తన కెరీర్లో ట్రిపుల్ రోల్ చేయని అల్లు అర్జున్ నుంచి ఈ ప్రాజెక్ట్ వస్తుందన్న వార్త నిజమైతే, బాక్సాఫీస్ వద్ద అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. కాగా, ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
