హెచ్1బి సహా పలు వీసాలపై అమెరికాకు వెళ్లి ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు కొత్త జాబ్ వెతుక్కునేందుకు ఇప్పటివరకు అమల్లో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ సదుపాయాన్ని తొలగించాలనే అంశంపై శ్వేతసౌధం సమీక్ష ముగిసింది. అయితే, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఒకవేళ గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటే, ఆపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం దీనిని ఫెడరల్ రిజిస్టర్లో పొందుపరుస్తారు. దీనికోసం సాధారణంగా 30 నుంచి 60 రోజుల సమయం కేటాయిస్తారు.
అది అధికారికంగా వెలువడే వరకు కొత్త నిబంధనలకు సంబంధించిన విధివిధానాలు ఏంటనేది బయటకు రాదు. ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు మరో ఉపాధి వెతుక్కునేందుకు వీలుగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును అమెరికా ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. ఈ గడువులోగా ప్రధాన వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దేశంలో ఉండేందుకు అనుమతి లభిస్తోంది. ఒకవేళ ఈ వెసులుబాటు కనుక రద్దయితే, ఉద్యోగం కోల్పోయిన క్షణం నుంచే విదేశీ కార్మికులు, వారిపై ఆధారపడిన వారు వెంటనే అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుంది.
