నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు భూకంపాలు, హిమ నది కరగడం లేదా వర్షాలు కారణం కాదని, కేవలం మంచు, రాళ్ల విస్ఫోటమే ఆ ప్రళయానికి కారణమని తాజా అధ్యయనంలో తేలింది. గత బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు, బురద ఉధృతికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. దీనిపై నేపాల్ పర్యావరణ సొసైటీ (ఎన్ఎస్ఎస్) సమగ్రంగా అధ్యయనం నిర్వహించింది.
విస్ఫోటనం ఎక్కడ జరిగింది?
రసువా జిల్లాలోని లాంగ్టాంగ్ లీరుంగ్లో 5,200 మీటర్ల ఎత్తు నుంచి మంచు, రాళ్లు భారీ శబ్దంతో విస్ఫోటం చెంది లిండే నదిలో పడ్డాయి. ఆ ప్రవాహం భోటే కోషి, త్రిశూలి నదుల ద్వారా ఉద్ధృతంగా ముందుకు సాగింది. ఆ ప్రాంతం నుంచి సుమారు 2,930 మీటర్ల ఎత్తున ఉన్న లిండే నదిపై ఈ విస్ఫోట పదార్థాలు పడ్డాయి. 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో భౌగోళిక మార్పులు సంభవించినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేవలం 0.56 చదరపు కిలోమీటర్ల పరిధిలోని హిమానీ నదమే విస్ఫోటమైంది.
ప్రవాహ వేగం సమయం ఎంత?
మంచు ఫలకం కేవలం 7 నిమిషాల్లోనే దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి, గంటకు 167 కిలోమీటర్ల వేగంతో రసువాగధికి చేరుకుందని ఎన్ఎస్ఎస్ వెల్లడించింది. ఆ తర్వాత రసువాగధి నుంచి బేత్రబాటికి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రవాహం సాగింది. ఈ భారీ ప్రవాహం తన వెంట పెద్ద ఎత్తున రాళ్లు, శిథిలాలు, మట్టిని మోసుకొచ్చింది.
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఈ ప్రాంతంలో ఎటువంటి భారీ వర్షపాతమూ నమోదు కాలేదని అధ్యయనంలో తేలింది. శాటిలైట్ చిత్రాలు, జల, వాతావరణ సమాచారం, నదీ వ్యవస్థ వెంబడి ఉన్న భూభాగ తీరు, ఎత్తు, వాలులను పరిశీలించగా.. ఎటువంటి సరస్సులు ఉప్పొంగినట్లు ఆనవాళ్లు లభించలేదని నిపుణులు స్పష్టం చేశారు.
రెండో విస్ఫోటనం ప్రభావం ఎంత?
బుధవారం ఉదయం 8.37 గంటల సమయంలో లాంగ్టాంగ్ లీరుంగ్ వద్ద మంచు ఫలకం కిందికి రావడం ప్రారంభమైంది. తొలి విస్ఫోటం జరిగిన 3 గంటల 8 నిమిషాల తర్వాత మరొక మోస్తరు మంచు ఫలకం వచ్చి చిన్నపాటి డ్యామ్లా ఏర్పడింది. ఆ తర్వాత అది కూడా విస్ఫోటమై వరదను సృష్టించినప్పటికీ, దానివల్ల పెద్దగా ప్రాణనష్టం జరగలేదని నివేదిక పేర్కొంది.
