పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మళ్ళీ వైమానిక దాడులతో విరుచుకుపడింది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌లో జరుగుతున్న ఒక వివాహ వేడుకపై ఈ దాడి జరగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
పశ్చిమాసియాలో తమ సైనికులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు యత్నిస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అందుకే ఆ దేశంపై మళ్లీ దాడులు చేయాల్సి వచ్చిందని తెలిపింది. వాషింగ్టన్ చర్యకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో టెహ్రాన్ దాడులు నిర్వహించింది.
హర్మూజ్ జలసంధికి నా పేరు పెడదాం..
హర్మూజ్ ప్రాంతం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దానికి ‘ట్రంప్ జలసంధి’గా పేరు మారుద్దామని ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుత తాము చేస్తున్న దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తే, ఆ దేశంపై మరింత భీకరంగా విరుచుకుపడతామని హెచ్చరించారు.
మరోవైపు, హర్మూజ్‌లో సముద్ర మందుపాత్రలను తాకడం వల్ల రెండు చమురు ట్యాంకర్లలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికాపై వినూత్న రీతిలో దాడి చేస్తామని ఆ దేశం హెచ్చరించింది.
