పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లోని ‘పికాక్స్ పర్వతం’ కింద ఉన్న భూగర్భ అణు కేంద్రంపై త్వరలోనే దాడి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. టెహ్రాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఓవల్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇరాన్‌పై సైనిక చర్య మొదలై ఐదు నెలలు అయిందని, ఈ కాలంలో ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయకుండా విజయవంతంగా నిరోధించామని ఆయన పేర్కొన్నారు.
పికాక్స్ పర్వతం ప్రత్యేకత..
స్థానికంగా ‘కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా’ అని పిలిచే ఈ పర్వతాన్ని ‘పికాక్స్ పర్వతం’ అంటారు. ఇది జాగ్రాస్ పర్వత శ్రేణిలో, నతాంజ్ అణు కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఇరాన్ ఈ భూగర్భ ప్రాంతానికి తరలించి ఉండొచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గతంలోనే అంచనా వేశాయి. అయితే, ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయనేదానిపై స్పష్టత లేదు.
ఇరాన్ తీవ్ర స్పందన..
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ అత్యంత తీవ్రంగా స్పందించింది. అమెరికా తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఒకవేళ పికాక్స్ పర్వతంపై అమెరికా గనుక దాడికి దిగితే, పశ్చిమాసియాలోని యూఎస్ సైనిక స్థావరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో ఆ ప్రాంతంలో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది.
