భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ, వాణిజ్య , దౌత్యపరమైన బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఫ్లోరిడాలోని మయామీ వేదికగా రానున్న డిసెంబర్లో జరుగబోయే జీ20 సదస్సులో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్న ప్రపంచ నాయకుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సుకు మోదీ హాజరవుతారని తాము బలంగా ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఒకవేళ జీ20 సదస్సులో మీరు ఎవరిని కలవాలని ఆశిస్తున్నారని ట్రంప్‌ను ప్రశ్నిస్తే, ఆయన ఎలాంటి తటపటాయంపు లేకుండా మోదీ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తారని గోర్ తెలిపారు. అంతేకాకుండా, ప్రధాని మోడీని ట్రంప్ తన వ్యక్తిగత స్నేహితుడిగా భావిస్తారని, రాబోయే ఏడాదిలో ట్రంప్ భారత్‌ను సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన సూచించారు.
మోదీపై ప్రశంసలు..
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కొంతమేర సరిదిద్దాల్సి వస్తున్నప్పటికీ, ఈ ఒప్పందం తుది దశకు చేరుకుందని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. రానున్న కొన్ని నెలల్లోనే ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన భారత్‌కు అత్యంత సుస్థిరతను చేకూర్చారని కొనియాడారు.
