భారతీయ బుల్లితెరపై చారిత్రాత్మక ఐకానిక్ సీరియల్ ‘రామాయణం’ను అందించిన దివంగత దర్శకుడు రామానంద్ సాగర్ మనవడు, నిర్మాత శివ్ సాగర్.. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ‘రామాయణం’ సినిమా కాస్టింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండటాన్ని తాను వ్యక్తిగతంగా అంగీకరించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
అభిమానుల సెంటిమెంట్ ..
రణబీర్ కపూర్ అద్భుతమైన నటుడనడంలో ఎలాంటి సందేహం లేదని శివ్ సాగర్ స్పష్టం చేశారు. అయితే ఆయన నటించిన ‘యానిమల్’ వంటి హింసాత్మక, వివాదాస్పద చిత్రాల ప్రభావం రణబీర్ ఇమేజ్‌పై ఉందని అభిప్రాయపడ్డారు. అలాంటి నెగెటివ్ ఛాయలున్న పాత్రలు చేసిన నటుడిని శ్రీరాముడి పవిత్రమైన రూపంలో చూడటం ప్రేక్షకులకు కష్టంగా ఉంటుందన్నారు. రామాయణం అనేది కేవలం పౌరాణిక గాథ మాత్రమే కాదని, కోట్ల మంది ప్రజల నమ్మకం, చరిత్ర అని గుర్తుచేశారు. అందుకే ఇలాంటి పాత్రలకు ఎలాంటి ఇమేజ్ లేని కొత్త ముఖాలను ఎంచుకుంటే ప్రజలు నేరుగా దేవుడిగా స్వీకరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతర నటులపై ప్రశంసలు..
అయితే, సినిమా మార్కెటింగ్ , బిజినెస్ పరంగా చూస్తే రణబీర్ కపూర్ లాంటి పెద్ద స్టార్‌ను ఎంచుకోవడం సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని శివ్ సాగర్ అంగీకరించారు. ఇక ఇదే చిత్రంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి, రావణుడి పాత్ర పోషిస్తున్న యష్ ఎంపికను ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా యశ్‌కు ఎలాంటి ప్రతికూల బ్యాగేజ్ లేకపోవడం పెద్ద సానుకూలాంశం అని కొనియాడారు.
ఈ చిత్రంలో దశరథుడిగా అరుణ్ గోవిల్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటిస్తున్నారు. నితేష్ తివారీ దార్శనికతలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దీపావళికి విడుదలవుతున్న నేపథ్యంలో, పాత్రల ఆమోదాన్ని తుదిగా నిర్ణయించేది ప్రేక్షకులేనని శివ్ సాగర్ తేల్చిచెప్పారు.
