సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల భద్రతకు సంబంధించి ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ (Meta) ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. చిన్నారులపై జరిగే లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన వివరాలను నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు అందించేందుకు ఆ సంస్థ అంగీకరించింది.
కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలు ..
ఆన్లైన్ వేదికల్లో పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు స్పష్టం చేసింది. హానికర కంటెంట్‌ను అణచివేసే అంశంపై సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అటువంటి అవాంఛిత కంటెంట్‌ను గుర్తించి సామాజిక మాధ్యమాల నుంచి పూర్తిగా తొలగించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
నోటీసులు , ప్రాధాన్యత..
ఇలాంటి హానికర కంటెంట్ వ్యవహారంలో భారతదేశంలోని మెటా ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం గతంలో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మెటా సంస్థ తాజా నిర్ణయం తీసుకోవడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
