మెక్సికో , దక్షిణ అమెరికా దేశాల నుంచి అక్రమ వలసలను పూర్తిస్థాయిలో అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పశ్చిమ టెక్సాస్లోని మారుమూల బిగ్ బెండ్ ప్రాంతంలో సరిహద్దు గోడ నిర్మాణాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రారంభించింది. ఏకంగా 4,600 కోట్ల డాలర్లతో చేపట్టిన భారీ సరిహద్దు భద్రతా ప్రణాళికలో ఈ బిగ్ బెండ్ గోడ నిర్మాణం ఒక మైలురాయిగా నిలిచింది. పశ్చిమ టెక్సాస్లోని హడ్స్పెత్ జిల్లా పరిధిలో ఉక్కు ప్యానెళ్లను బిగిస్తున్నట్లు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విభాగం అధికారికంగా వెల్లడించింది.
సరిహద్దు వెంబడి వేగంగా బారికేడ్ల ఏర్పాటు..
ఎల్ పాసో దక్షిణాన ఉన్న హడ్స్పెత్ జిల్లా నుంచి అమిస్టాడ్ సరస్సు వరకు సుమారు 500 మైళ్ల బిగ్ బెండ్ ప్రాంతంలో మొత్తం ఐదు ఉక్కు గోడ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 15వ తేదీన ఇక్కడ మొదటి ఉక్కు ప్యానెళ్లను విజయవంతంగా అమర్చినట్లు సీబీపీ అధికారులు తెలిపారు. దాదాపు 2,000 మైళ్ల మెక్సికో సరిహద్దు వెంబడి వారానికి సగటున 12 మైళ్ల మేర బారికేడ్లను నిర్మిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతి కాలంలోనే కొత్తగా సుమారు 200 మైళ్ల మేర బారికేడ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
స్థానికులు , పర్యావరణవేత్తల నిరసనలు..
ఈ మారుమూల సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి అక్రమ వలసలు లేదా చొరబాట్లు జరగడం లేదని స్థానిక ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ గోడ నిర్మాణం వల్ల తమ ప్రాంతానికి భారీగా వరద ముప్పు పొంచి ఉందని ఒక సరిహద్దు పట్టణం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు, తమ పవిత్ర ప్రదేశాలు దెబ్బతింటున్నాయని స్థానిక గిరిజనులు, తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భూ యజమానులు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు పర్యావరణ పరిరక్షణ బృందాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆందోళనకారులు , స్థానికులతో చర్చలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం బిగ్ బెండ్ నేషనల్ పార్క్ పరిధిలో నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది.
