అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ టెక్సాస్‌లోని షుగర్‌లాండ్‌లో ఉన్న 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెక్సాస్‌లోని అష్టలక్ష్మి దేవాలయంలో 2024లో ఈ హనుమాన్ విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. అయితే, అప్పటి నుంచి కొందరు ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జెస్సీ హూజెస్ అనే యూట్యూబర్ హనుమంతుడి విగ్రహ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ పార్టీ గెలిచాక ఈ విగ్రహాన్ని కూల్చేస్తామని బెదిరింపు ధోరణిలో కామెంట్ పెట్టడం కలకలం రేపింది.
హిందువులు, లౌకికవాదుల ఆగ్రహం ..
యూట్యూబర్ చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికాలోని హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన పవిత్ర ప్రతీకను ఇలా కూల్చేస్తామని బెదిరించడం హిందూయిజాన్ని లక్ష్యంగా చేసుకోవడమేనని మండిపడ్డారు. హిందూ సంఘాలకు అమెరికాలోని పలువురు లౌకికవాదులు కూడా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం అమెరికాలో మధ్యంతర ఎన్నికల వాతావరణం వేడెక్కిన తరుణంలో, ఈ విగ్రహం తొలగింపు అంశం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల రాజకీయాల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
