సాధారణంగా పీతలు, రొయ్యల పెంకులను వ్యర్థాలుగా భావించి పారేస్తుంటాం. అయితే అమెరికాలోని మేరీలాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వీటితో ఒక వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేశారు. పీతల పెంకులలో లభించే వ్యర్థాల సహాయంతో పర్యావరణానికి హాని చేయని సరికొత్త జింక్ బ్యాటరీని తయారు చేయవచ్చని నిరూపించారు.
చిటోసాన్తో జెల్ ఎలక్ట్రోలైట్..
బ్యాటరీ ప్రధానంగా పనిచేయడానికి ఎలక్ట్రోలైట్ ఎంతో కీలకం. సాంప్రదాయ బ్యాటరీలలో వాడే పదార్థాలు సులభంగా విచ్ఛిన్నం కాకపోగా, కొన్నింటిలో అగ్నిప్రమాదాల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు జీవ పదార్థాలపై దృష్టి పెట్టారు. పీతలు, రొయ్యల పెంకులలో ఉండే ‘చిటిన్’ అనే పదార్థాన్ని ప్రాసెస్ చేయగా లభించే ‘చిటోసాన్’ ద్వారా జెల్ ఎలక్ట్రోలైట్‌ను తయారు చేశారు.
పర్యావరణ హిత బ్యాటరీ..
ఈ బ్యాటరీ తయారీలో ఖరీదైన లిథియం బదులుగా భూమిపై పుష్కలంగా లభించే చౌకైన ‘జింక్’ లోహాన్ని ఎంచుకున్నారు. చిటోసాన్ ఎలక్ట్రోలైట్కు సహజంగానే బయోడిగ్రేడబుల్ సామర్థ్యం ఉండటం విశేషం. అంటే ఇది ప్రకృతిలో శతాబ్దాల పాటు అలాగే ఉండిపోకుండా, సుమారు ఐదు నెలల్లోపే సూక్ష్మజీవుల ద్వారా పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది.
పనితీరు పరంగానూ ఈ జింక్-చిటోసాన్ బ్యాటరీ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. వెయ్యి సార్లు ఛార్జింగ్ సైకిల్స్ పూర్తి చేసిన తర్వాత కూడా ఇది ఏకంగా 99.7 శాతం ఇంధన సమర్థతను (ఎనర్జీ ఎఫిషియెన్సీ) కలిగి ఉండటం గమనార్హం.
