సినీ కెరీర్లో నటి రష్మిక మందన్న ఒక్కో చిత్రంతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలలో కేవలం గ్లామర్, లవ్ ట్రాక్‌లకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న బలమైన పాత్రలను ఎంచుకుంటున్నారు.
అట్లీ సినిమాలో రష్మిక రోల్ ప్రత్యేకత..
ప్రస్తుతం అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలో రష్మిక భాగం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ హీరోయిన్ షేడ్స్‌కు భిన్నంగా కథను మలుపు తిప్పే బలమైన కోణం ఈ పాత్రలో ఉంటుందని టాక్. కొన్ని సన్నివేశాలలో నెగటివ్ టచ్ ఉన్నప్పటికీ, పాత్రను కేవలం మంచిది లేదా చెడ్డదిగా కాకుండా కథకు తగినట్లుగా మలచడంలో అట్లీ ప్రత్యేకత రష్మిక పాత్రకు మరింత హైప్ తెస్తోంది.
నటిగా మరో మెట్టు ఎక్కే అవకాశం..
కథలో కీలకమైన మలుపులకు కారణమయ్యే ఈ బలమైన పాత్ర రష్మిక కెరీర్‌కు మరో మైలురాయిగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాలోని ఆమె పాత్ర వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతుండటంతో ప్రేక్షకులు , అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.
