డిసెంబరు నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యతించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఫ్లోరిడా వేదికగా డిసెంబర్ 14 అలాగే 15 తేదీల మధ్య కాలంలో జీ20 సదస్సు నిర్వహించనున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సదస్సుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో, ఈ టూర్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వ అధికారిక వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
కెనడా పర్యటనపై ..
ఇదే జీ20 సదస్సు జరిగే సమయంలోనే ప్రధాని మోదీ కెనడా దేశంలో కూడా పర్యటించే సూచనలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల కోసం న్యూయార్క్ నగరానికి విచ్చేసిన కార్నీ, అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు. భారతదేశంతో వాణిజ్య పరమైన చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో ముందుకు వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ఈ ఏడాది ముగిసేనాటికి పూర్తి చేయాలని ఇరు దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నట్లు ఆయన వివరించారు.
