పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, యుద్ధరంగంలో సేవలందిస్తున్న సైనికులకు తీవ్రమైన మానసిక క్షోభను మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధ నౌకలోని అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారంటూ గతంలో వచ్చిన వార్తలను అమెరికా నేవీ తాత్కాలిక సెక్రటరీ హాంగ్ కావో తాజాగా అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సెనెట్‌కు ఓ లేఖ ద్వారా అసలు నిజాలను వెల్లడించారు. నౌకలో సిబ్బంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన మాట వాస్తవమేనని, అయితే సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడి..
ఇరాన్‌తో ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందే అమెరికా పశ్చిమాసియా జలాల్లో పలు యుద్ధ నౌకలను మోహరించింది. అందులో భాగంగానే యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌకలో ఐదు వేల మందికి పైగా నావికులు, మెరైన్లు విధులు నిర్వర్తించారు. అయితే రికార్డు స్థాయిలో ఏకంగా 250 రోజులుగా ఈ నౌక సముద్రజలాల్లోనే నిరంతరం కొనసాగుతూ వస్తోంది. అత్యంత సుదీర్ఘమైన మోహరింపు, సరిగా లభించని కనీస సదుపాయాలు, సుదీర్ఘకాలం పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సిరావడం వంటి కారణాలు సిబ్బందిపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయి. ఈ పరిణామాల కారణంగానే నావికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఆత్మహత్యాయత్నాల ఘటనల తర్వాత అప్రమత్తమైన అధికారులు, సెప్టెంబర్ ప్రారంభంలో ఆ నౌకలోని సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి కల్పించారు.
