అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను జామింగ్ లేదా బ్లాక్ చేస్తున్నట్లు బ్రిటన్ తాజాగా వెల్లడించింది. అయితే ఈ చర్యలు పూర్తిగా ఆత్మరక్షణ కోసమే చేపట్టినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బ్రిటన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ‘బీబీసీ’ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
భూ ఉపరితలం నుంచే నిఘా అడ్డుకట్ట..
భూ ఉపరితలం నుంచి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించి, శత్రుదేశాలకు చెందిన ఉపగ్రహాలు సమాచారాన్ని సేకరించకుండా బ్రిటన్ వాయుసేన (ది రాయల్ ఎయిర్ ఫోర్స్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అణు నిల్వలు, అణు జలాంతర్గాముల కదలికలు, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన ప్రదేశాల సమాచారం శత్రు శాటిలైట్లకు చిక్కకుండా యూకే ఈ సాంకేతికతను వాడుతోంది.
మిలిటరీ స్పేస్ స్క్వాడ్రన్ ఏర్పాటు..
బ్రిటన్కు చెందిన సొంత ఉపగ్రహాలను రక్షించుకునేందుకు ది రాయల్ ఎయిర్ఫోర్స్ తాజాగా ఒక ప్రత్యేకమైన ‘మిలిటరీ స్పేస్ స్క్వాడ్రన్’ను ఏర్పాటు చేసింది. అంతరిక్షంలోనూ శత్రువుల నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని రాఫ్ (RAF) అధిపతి ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణ సమాచారం శత్రువులకు చేరకుండా ఈ స్పేస్ స్క్వాడ్రన్ పటిష్టమైన రక్షణ కల్పిస్తుందని, శత్రుదేశాల క్షిపణి దాడుల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నౌకలకు దిశానిర్దేశం చేస్తుందని యూకే రక్షణశాఖ వివరించింది.
రష్యా నుంచి నిరంతరం ముప్పు..
ప్రపంచంలోని పలు దేశాలు ప్రస్తుతం భూ ఉపరితలం నుంచే శాటిలైట్లను జామింగ్ చేసే టెక్నాలజీని వాడుతున్నాయి. ఇదే అంశంపై గతేడాది యూకే స్పేస్ కమాండ్ కీలక ప్రకటన చేస్తూ.. బ్రిటన్ శాటిలైట్లను రష్యా ప్రతివారం అడ్డుకునేందుకు యత్నిస్తోందని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో రెండు వాణిజ్య ఉపగ్రహాల సమీపంలో ఐదు రష్యన్ ఉపగ్రహాలు కదలడాన్ని రాఫ్ గుర్తించింది. అలాగే జూన్ నెలలోనూ రష్యన్ ఉపగ్రహాలు ఐరోపా, కెనడా ప్రాంతాల్లో జీపీఎస్ సంకేతాలకు అంతరాయం కలిగించాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
