వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా మోసపూరిత విధానాల ద్వారా దేశంలోకి ప్రవేశించిన వారిని ఏరివేసేందుకు సరికొత్త వ్యూహానికి తెరలేపింది.
ఆన్లైన్ వీసా ఫ్రాడ్ టిప్ పోర్టల్ ఏర్పాటు..
అక్రమ పద్ధతుల్లో వీసాలు పొందిన వారి వివరాలను ప్రభుత్వానికి చేరవేయడానికి ‘ఆన్లైన్ వీసా ఫ్రాడ్ టిప్ పోర్టల్’ను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఈ పోర్టల్ ప్రత్యేక పేజీగా అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే మోసపూరిత మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టినట్లు తెలిస్తే, సాధారణ ప్రజలు ఈ పోర్టల్ ద్వారా అధికారులకు సులభంగా సమాచారం అందించవచ్చు.
మోసాలను గుర్తించేందుకు ..
దొంగ పెళ్లిళ్లు, నకిలీ పత్రాలతో హెచ్-1బీ, పర్యాటక అలాగే విద్యార్థి వీసాలు పొందినవారిని గుర్తించేందుకు ఈ వేదికను ప్రధానంగా వాడుతున్నారు. అలాగే జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో అమెరికాకు వచ్చి పిల్లలను కనే పద్ధతులకు కూడా ఈ కొత్త నిఘా ద్వారా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే రహస్య సమాచారం ఆధారంగా అక్రమ వీసాదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ వేదిక ద్వారా ఎవరైనా కావాలనే తప్పుడు సమాచారమిస్తే వారిపై కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ట్రంప్ ప్రభుత్వ లక్ష్యాలు ..
అమెరికన్ పౌరులకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను తక్కువ వేతనాలతో వలసదారులు తన్నుకుపోతున్నారనేది ట్రంప్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వీసాల జారీ ప్రక్రియను పూర్తిగా నియంత్రించడం, నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలపై అగ్రరాజ్యం ప్రధానంగా దృష్టి సారించింది.
