చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ఒక విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రాన్ టెక్నాలజీస్ అధిపతి సంజయ్ మెహ్రోత్రా తదితర ప్రముఖ భారత సంతతి టెక్ దిగ్గజాలు హాజరయ్యారు.
టెక్ ప్రముఖుల హాజరు..
ప్రస్తుతం అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, సాంకేతిక పరిజ్ఞానం , వాటి సరఫరా మార్గాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ టెక్ నిపుణులు ఈ విందులో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరితో పాటు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఓపెన్ ఏఐ చీఫ్ శ్యామ్ ఆల్ట్మాన్ వంటి సిలికాన్ వ్యాలీ ప్రముఖులు కూడా ఈ విందుకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంథ్రోపిక్ సీఈఓ గైర్హాజరు..
ఈ ప్రతిష్టాత్మక విందుకు ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డారియో అమోడెయి మాత్రం దూరంగా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా దూకుడు అమెరికాకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా మారుతుందని అమోడెయి ఇటీవల ఒక ఆర్టికల్‌లో హెచ్చరించిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది.
షీ జిన్‌పింగ్‌కు ప్రత్యేక బహుమతి..
ఈ విందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విశిష్ట అతిథి అయిన షీ జిన్‌పింగ్‌కు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. సతీమణి మెలానియా ట్రంప్ సహకారంతో తయారు చేయించిన ఆకర్షణీయమైన బంగారుపూత పూసిన గద్ద విగ్రహాన్ని జిన్‌పింగ్‌కు బహూకరించి గౌరవించారు.
