ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరో సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలో తన తండ్రి ప్రాణాలు తీసిన దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న ఆయన, ఆ తర్వాత జరిగిన మరో దాడి నుంచి కూడా బయటపడినట్లు ఇరాన్ మత పెద్ద ఒకరు వెల్లడించారు. ఆసుపత్రి శిథిలాల కింద చిక్కుకున్న ఆయనను అతి కష్టం మీదికి బయటకు తీసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, భద్రతా కారణాల వల్లే ఆయన బహిరంగంగా బయటకు రావడం లేదని తెలిపారు.
ఆసుపత్రులపై వరుస బాంబు దాడులు..
మొజ్తాబా ఖమేనీ గాయపడిన తర్వాత టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నగరంలోని మూడు ఆసుపత్రులు బాంబు దాడులకు గురయ్యాయి. మొజ్తాబా ఉన్న మూడో ఆసుపత్రిపై దాడి జరిగిన అనంతరం శిథిలాల నుంచి ఆయనను బయటకు తీశారు.
సురక్షిత ప్రాంతానికి తరలింపు..
ఆ దాడి అనంతరం ఖమేనీ గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయారని ఆ వర్గాలు వెల్లడించారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదని, ఆయన గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు.
