సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ బూమ్ శిఖరాగ్రాన ఉన్న సమయంలో కంప్యూటర్ సైన్స్ చదివితే చాలు సులభంగా ఉద్యోగాలు లభించేవి. కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రతిదీ డిజిటలైజ్ కావడంతో నియామకాలు ఆకాశాన్నంటాయి. 2022 ప్రారంభంలో జాబ్ సర్చ్ సైట్లలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పోస్టింగ్‌లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ కాలంలో అమెరికాలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించిన విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించగలిగారు.
విలవిల్లాడుతున్న కోడింగ్ రంగం..
గత నాలుగేళ్లలో టెక్ రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కృత్రిమ మేధ (ఏఐ) రాకతో కోడింగ్ రంగం సంక్షోభంలో పడింది. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు కోడ్ రైటింగ్‌లో సింహ భాగాన్ని ఏఐకి అప్పగిస్తున్నాయి. దీంతో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు 7.1 శాతానికి పెరిగింది. కోడింగ్ బూమ్ సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో చేరిన వారికి ఇప్పుడు లే-ఆఫ్స్ ఎదురుకాగా, ప్రవేశ స్థాయి ఉద్యోగాలు దొరకడం మరింత కష్టమవుతోంది.
తగ్గుతున్న ప్రవేశాలు ..
అమెరికాలో 2024 నాటికి సుమారు 3,62,000కు చేరుకున్న కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య గత సంవత్సరం నుంచి తగ్గడం ప్రారంభమైంది. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సుల్లో ప్రవేశాలు ఏకంగా 8.4 శాతం తగ్గాయి. గతంలో కంప్యూటర్ సైన్స్‌లో పెద్ద సంఖ్యలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు ఇప్పుడు ఉద్యోగ మార్కెట్లో తీవ్ర సవాళ్లు ఎదురుకాగా, వాటికి అమెరికా వలస విధానంలో వచ్చిన మార్పులు మరింత తోడయ్యాయి.
కాలేజీల సరికొత్త ప్రత్యామ్నాయాలు..
మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అమెరికాలోని పలు కళాశాలలు తమ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలలో మార్పులు చేస్తున్నాయి. జార్జియా టెక్ వర్సిటీ ప్రొఫెసర్లు ఏటీ అండ్ టీ కంపెనీ అవసరాలను పరిశీలించి, ఇంటర్న్‌షిప్‌లకు ముందు విద్యార్థులకు నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ‘బూట్ క్యాంప్ టూ ఇండస్ట్రీ’గా పిలిచే ఈ సరికొత్త ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించాలని ఆ సంస్థ యోచిస్తోంది.
