మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’. ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి గీతం ‘నారాయణమ్మ’ శ్రోతల ముందుకు వచ్చి విశేషమైన స్పందనను రాబట్టుకుంటోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ పాటను ప్రభ – రామ్ మిరియాల ఆలపించగా, సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించారు. ఈ ప్రత్యేక గీతంలో డింపుల్ హయాతి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించగా, విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ తదితరులు ఈ పాటను మరింత కలర్ఫుల్గా మార్చారు.
వైభవంగా గీతావిష్కరణ వేడుక..
దస్పల్లా హోటల్లో ఈ సినిమా గీతావిష్కరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేదికపై సందడి చేస్తూ ప్రచార కార్యక్రమాలకు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టారు. ఈ అక్టోబర్ 9న సినిమాతో అందరం థియేటర్లలో కలుద్దామని, ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని త్రివిక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వెంకటేష్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న త్రివిక్రమ్..
పాట షూటింగ్ సమయంలో డింపుల్ అనారోగ్యంతో ఉన్నా ఎంతో ఇష్టపడి, కష్టపడి పనిచేశారని త్రివిక్రమ్ ప్రత్యేకంగా అభినందించారు. అందరిలాగే తనకు కూడా వెంకటేష్ అంటే ఎంతో అభిమానమని, తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో మొట్టమొదటిసారిగా పెన్ను పట్టి డైలాగ్ రాసింది వెంకటేష్ సినిమా ‘పవిత్ర బంధం’ కోసమేనని వెల్లడించారు. ఆ తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఆ ప్రయాణం మరింత బలపడిందని, వెంకటేష్‌తో ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఆయనపై గౌరవంతో కూడిన భయం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఇన్ని దశాబ్దాల కెరీర్ తర్వాత కూడా వెంకటేష్‌లో సినిమాపై ఉండే తపన ఏమాత్రం తగ్గలేదని, ఒంట్లో బాగోకపోయినా సరే ఆయన డబ్బింగ్ పనులను పూర్తి చేశారని ఆయన అంకితభావాన్ని కొనియాడారు. అలాగే సంగీత దర్శకుడు తమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తనకు కుటుంబ సభ్యులతో సమానమని చెప్పారు.
