అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు , ఇరాన్ స్పందన కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకోసం చేసిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడంతో ఇరాన్ నుంచి బలమైన వార్నింగ్ వచ్చింది. అమెరికాతో తాము అంతిమ యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
చర్చలకు సిద్ధం..
ఒకవేళ పరిస్థితి అంతిమ యుద్ధానికి దారితీసినా ఎదుర్కొంటామని, అదే సమయంలో చర్చలకు కూడా తాము సిద్ధమేనని అరాగ్చీ తెలిపారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రతిపాదనలను ట్రంప్ బహిరంగంగా తిరస్కరించడంపై ఆయన స్పందిస్తూ, ఈ అంశంపై దౌత్య మార్గాల ద్వారా తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పారు. అక్రమంగా ఫ్రీజ్ చేసిన తమ డబ్బులు, ఆస్తులు తమకు వెనక్కి రావాలని, తమ చమురును అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
కింగ్ఫిష్ డ్రోన్ స్వాధీనంపై భిన్న వాదనలు..
అమెరికాకు చెందిన కింగ్ఫిష్ డ్రోన్ గూఢచర్యానికి పాల్పడుతోందని, దానిని తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను అమెరికా పూర్తిగా తోసిపుచ్చింది. తమ డ్రోన్లు అన్నీ సురక్షితంగానే ఉన్నాయని అమెరికా స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం ‘రీమస్ 600’ అనే స్వయంప్రతిపత్తిగల అండర్వాటర్ వెహికల్ (AUV)ను కింగ్ఫిష్ అని కూడా పిలుస్తుంటుంది.
