కాలిఫోర్నియాలోని డబ్లిన్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగిన ఘటనలో, ప్రముఖ ‘న్యూయార్క్ టైమ్స్’ సంస్థ టెక్ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఆయన అత్తామామలు తుపాకీతో కాల్చి హతమార్చారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ హత్యకు ‘ట్రాన్స్‌జెండర్’ గుర్తింపునకు సంబంధించిన గొడవలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
న్యూయార్క్ టైమ్స్‌లో టెక్కీగా పనిచేస్తున్న 40 ఏళ్ల జొనాథన్ మెకిన్సీ, ఆయన భార్య క్యాండిస్ జాంగ్ కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. జొనాథన్ మెకిన్సీ 2010లో శస్త్రచికిత్స ద్వారా పురుషుడిగా మారిన తర్వాత క్యాండిస్ జాంగ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తరువాత జొనాథన్ ‘ట్రాన్స్‌జెండర్’ నేపథ్యంపై ఆయన భార్య తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
ఈ వివాదం కారణంగా గతంలో జొనాథన్ కోర్టును కూడా ఆశ్రయించారు. అత్తామామలు తనను పదేపదే అవమానపరిచేలా మాట్లాడేవారని ఆయన ఆరోపించారు. మరోవైపు, జొనాథన్ తనను వేధించేవాడని ఆయన భార్య సైతం గతంలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురికావడంతో, పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.
