ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా మరోసారి సుముఖత చూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తుది ఒప్పందంలో భాగంగా ఇరాన్‌పై ఆంక్షలను సడలించడంతో పాటు, విదేశాలలో నిలిచిపోయిన టెహ్రాన్ నిధులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అణు అంశంలో ఇరాన్ స్పష్టమైన పురోగతి చూపిస్తేనే ఇది సాధ్యమవుతుందని ఒక అధికారి సీఎన్ఎన్కు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఈ చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై పరిష్కారం లభించకుండా ఎలాంటి తుది ఒప్పందం ఉండదని వారు స్పష్టం చేశారు. అమెరికా తరఫున ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు ఈ చర్చల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
