అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు తమ ప్రత్యర్థులపై పోటాపోటీగా భారీ రివార్డులను ప్రకటించాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్న ముగ్గురు కీలక ఐఆర్జీసీ (IRGC) ఏరోస్పేస్ ఫోర్స్ అధికారుల గురించి సమాచారం ఇస్తే ఏకంగా 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.143 కోట్లు) బహుమతి అందజేస్తామని అమెరికా ప్రకటించింది. బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా మెహ్రాబీ, అహ్మద్ జాఫరాబాది, అలీ అస్గర్ నౌరూజీలను ఈ జాబితాలో పేర్కొన్నట్లు తెలిపింది. సమాచారం అందించిన వారికి నగదు బహుమతితో పాటు పునరావాసం కల్పిస్తామని కూడా వెల్లడించింది.
ఇరాన్ సైన్యం ప్రతి ఆఫర్..
మరోవైపు, టెహ్రాన్పై వాషింగ్టన్ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. అమెరికా భూతల దాడులు చేపట్టి తమ దేశంలోకి ప్రవేశిస్తే.. ఆ సైనికులను హతమార్చిన లేదా బంధించిన పౌరులకు 5 బిలియన్ టోమన్లు (దాదాపు రూ.11 కోట్లు) రివార్డు ఇస్తామని ఇరాన్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమీనియా ప్రకటించారు. అంతేకాకుండా, అమెరికా సైనికులను మహిళలు బంధిస్తే రెట్టింపు బహుమతి ఇస్తామని, ప్రపంచ దేశాల ప్రజలందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే సైనికులను మట్టుబెట్టడానికి ఉపయోగించిన ఆయుధాలను రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.
