అమెరికా, ఇరాన్‌ల మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేపట్టిన దౌత్య ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. ఈ వారంలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు దేశాలు తమ పట్టు వీడకపోవడంతో ఒప్పందం కుదరలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
విఫలమైన ఖతార్ రాయబార చర్చలు..
ఈ చర్చల ప్రక్రియలో భాగంగా సోమవారం ఖతార్ ప్రధాన రాయబారి అలీ అల్-థవాదీ న్యూయార్క్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఆయన బృందంతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇరాన్‌పై ఉన్న నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ కోరగా, అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది. ఈ రెండు డిమాండ్లను బ్యాలెన్స్ చేస్తూ ఖతార్ ఒక రెండు పేజీల ఒప్పంద ప్రతిపాదనను సిద్ధం చేసి చర్చలు జరిపింది. ఆ తర్వాత అల్-థవాదీ వాషింగ్టన్కు వెళ్లి ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ , ఇతర కీలక అధికారులతో భేటీ అయ్యారు.
ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌తో తలకిందులైన సీన్..
నిజానికి సోమవారం ఉదయం వరకు చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఇరాన్ అణు అంశాలపై కొంత వెనక్కి తగ్గే సంకేతాలు ఇచ్చిందని అమెరికా అధికారులు భావించారు. కానీ ఖతార్ ప్రతినిధులు వైట్ హౌస్‌లో ఉన్న సమయంలోనే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా తాము ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని స్పష్టం చేయడంతో చర్చల సరళి ఒక్కసారిగా మారిపోయింది.
ఇరు దేశాల మొండి వైఖరి..
అమెరికా మాత్రం ఈ పోరులో తమదే పైచేయి అని, తాము తగ్గి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదనే ధీమాతో ఉంది. గత ఏడాది జూన్ నాటి మూల ఒప్పందానికి అమెరికా కట్టుబడితేనే ఆలోచిస్తామని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సిన్ రజాయీ మాట్లాడుతూ.. ట్రంప్ సరిగ్గా చర్చలు జరపలేక, అలాగని యుద్ధం చేయలేక సతమతమవుతున్నారని విమర్శించారు. మరోవైపు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సంక్షోభంలో ఉందని, వారు అణు ఆయుధం పొందకుండా ఎప్పటికీ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో దౌత్యపరమైన పరిష్కారం లభించడం కష్టమని, అమెరికాలో మిడ్-టర్మ్ ఎన్నికల తర్వాత ట్రంప్ సైనిక చర్యలకు ఆదేశించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
