టాలీవుడ్లో ఒక హిట్ కొట్టిన తర్వాత దర్శకులు తమ తదుపరి సినిమాల స్కేల్‌ను భారీగా పెంచడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. అయితే అలా భారీ కాన్వాస్‌తో వస్తున్న యువ దర్శకులకు కొన్నేళ్లుగా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ‘పెద్ది’ చేయగా, దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ చిత్రాలతో పెద్ద ప్రపంచాన్నే సృష్టించారు. కానీ ఆ సినిమాల ఫలితాలు కొద్దిగా భిన్నంగా వచ్చాయి.
కార్తీక్ దండు క్రేజీ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’..
విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా బలమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ దండు, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ అనే మైథికల్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా ప్రచారం ఉన్నప్పటికీ, విరూపాక్ష కథతో సుకుమార్‌ను కలవడం ద్వారా కార్తీక్ జర్నీ ప్రారంభమైంది. ఆ సినిమా స్క్రీన్‌ప్లేపై ఇద్దరూ కలిసి పనిచేయగా, ఇప్పుడు ‘వృషకర్మ’కు కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా ఉంది.
భారీ సెట్లు , పకడ్బందీ టెక్నికల్ టీమ్..
విరూపాక్షలో ఒక ఊరు, మిస్టరీ చుట్టూ కథ నడిపించిన కార్తీక్, ఈసారి పూర్తిగా భిన్నమైన ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నాగచైతన్య కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ , పెద్ద స్కేల్లో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్‌గా ప్రమోట్ అవుతోంది. ‘తండేల్’ తర్వాత చైతన్య మార్కెట్ పెరగడంతో మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. మిగతా యువ దర్శకుల భారీ సినిమాల సెంటీమెంట్లు ఇలా ఉన్న నేపథ్యంలో, కార్తీక్ దండు ఈ భారీ అంచనాలను ఏమేరకు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
