ఇరాక్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా వైదొలిగింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూపునకు (ఐసిస్) వ్యతిరేకంగా పోరాడేందుకు 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సుదీర్ఘ ప్రయాణం తాజాగా ముగిసింది. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఉత్తర ఇరాక్‌లోని చివరి వైమానిక స్థావరాన్ని కూడా పూర్తిగా ఖాళీ చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది.
సైనిక ఉపసంహరణ , పెంటగాన్ ప్రకటన..
ఇర్బిల్లోని వైమానిక స్థావరం నుంచి తమ బలగాలతో పాటు భారీ సామగ్రిని పూర్తిగా తరలించినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పర్నెల్ వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో ఐసిస్‌ను సమర్థవంతంగా ఓడించామని, భవిష్యత్తులోనూ ఇరాక్ సైన్యానికి అవసరమైన శిక్షణ, నిఘా సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇరాక్ సైనిక బలగాల పూర్తి ఉపసంహరణ ఆ దేశ సైనిక సామర్థ్యం పెరుగుతుందనడానికి , సార్వభౌమత్వానికి నిదర్శనమని ఇరాక్ ప్రకటించింది. అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ ఇది సరికొత్త ప్రారంభానికి సూచిక అని అభివర్ణించారు.
స్థానిక ప్రజల ఆందోళనలు..
అమెరికా సేనల నిష్క్రమణ పట్ల ఇరాక్‌లోని ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూపులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అయితే కుర్దిష్తోపాటు కొన్ని ప్రాంతాల ప్రజల్లో మాత్రం భయం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఐసిస్ మళ్లీ విజృంభిస్తుందని, ఇరాన్ అనుకూల గ్రూపులు రెచ్చిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా సేనల ప్రయాణం ..
2003లో ఇరాక్‌పై దండెత్తిన అమెరికా సేనలు నాటి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుడిని చేశాయి. ఆ తర్వాత 2011లో తొలిసారిగా అక్కడి నుంచి వెనుదిరిగాయి. అయితే, మూడేళ్ల తర్వాత ఐసిస్‌ను కట్టడి చేసేందుకు సహాయం చేయాల్సిందిగా ఇరాక్ ప్రభుత్వం కోరడంతో అమెరికా చిన్న సైనిక బృందాన్ని పంపింది. కాలక్రమేణా ఆ బలగాలు మళ్లీ విస్తరించాయి. చివరకు 2024లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు తాజాగా అమెరికా సేనలు పూర్తిగా వైదొలిగాయి. బాగ్దాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రదర్శనల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
