ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నుంచి ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు కూడా క్రమం తప్పకుండా వచ్చేవి. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ ఒకే ఏడాది రావడం, ఆ తర్వాత ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ వరుసగా విడుదల కావడం అభిమానులను అలరించింది. అయితే ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్లను ఎంచుకుంటున్న కొద్దీ సినిమాల మధ్య గ్యాప్ ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తోంది.
సోలో హీరోగా పెరిగిన సుదీర్ఘ విరామం..
‘అరవింద సమేత’ సినిమా 2018 అక్టోబర్లో విడుదలైన తర్వాత, రాజమౌళి దర్శకత్వంలోని ‘RRR’ కోసం ఎన్టీఆర్ చాలా సంవత్సరాలు కేటాయించాల్సి వచ్చింది. ఆ సినిమా రామ్ చరణ్తో కలిసి చేసిన మల్టీస్టారర్ కాగా, సోలో హీరోగా ‘దేవర’ సినిమా కోసం ఏకంగా ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ‘దేవర’ చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితి మారుతుందని భావించినా, 2025లో హృతిక్ రోషన్తో కలిసి బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంటే ‘దేవర’ నుంచి దాదాపు రెండన్నర సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ మరో భారీ సోలో సినిమాతో వస్తున్నారు.
గ్యాప్ పెరగడానికి అసలు కారణాలు..
‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ల స్కేల్ పూర్తిగా మారిపోయింది. ‘దేవర’ పాన్ ఇండియా రిలీజ్ కావడం, ‘వార్ 2’ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కింద వస్తుండటం, ఇప్పుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ భారీ సెటప్తో తెరకెక్కుతుండటం ఇందుకు ప్రధాన కారణం. షూటింగ్ సమయంతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్స్, పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. సినిమాల కౌంట్ తగ్గిపోయి, ప్రతి ప్రాజెక్ట్కు ఎక్కువ సమయం ఇస్తున్నందున.. భవిష్యత్తులోనూ ఇదే ప్యాటర్న్ కొనసాగితే సంవత్సరానికి ఒక సినిమా రావడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
