ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల దిగ్గజం స్టార్‌లింక్ భారత్‌లోకి అడుగుపెట్టే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. భారత మార్కెట్లోకి తాము రాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, దేశ సమగ్ర చట్టాలు , నిబంధనలకు లోబడితేనే అనుమతులు మంజూరవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం కేవలం టెలికాం పరిశ్రమలోని కార్పొరేట్ పోటీ మాత్రమేనా లేక దీని వెనుక జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయా అనే అంశం తెరపైకి వచ్చింది.
భారత మార్కెట్ కోసం మస్క్ తీవ్ర ప్రయత్నాలు..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 165 కంటే ఎక్కువ దేశాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న ఎలాన్ మస్క్, చాలాకాలంగా భారత మార్కెట్‌పై కన్నేశారు. చైనా తర్వాతి స్థానంలో సుమారు 100 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో భారత్ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ రంగంగా విలసిల్లుతుండటమే దీనికి ప్రధాన కారణం. దేశీయ అగ్రగామి సంస్థలైన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, దేశంలో శాట్‌కామ్ సేవలను పూర్తిస్థాయిలో నడపడానికి ఇంకా ఎవరికీ తుది అనుమతులు లభించలేదు. ఈ నేపథ్యంలో కొందరు పెద్దలే తన మార్గాన్ని అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించడం కలకలం రేపింది.
శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాధాన్యత , ప్రయోజనాలు..
సాంప్రదాయ టవర్లు, ఫైబర్ కేబుళ్లు నిర్మించడానికి వీలులేని కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులు, సరిహద్దు ప్రాంతాలకు టెలికాం సేవలు అందించడానికి ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు ఇప్పటికీ కనెక్టివిటీ లోపంతో ఇబ్బంది పడుతున్నాయి. తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి సాధారణ కేబుల్ వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ఈ శాటిలైట్ వ్యవస్థ నిరంతర సేవలను అందిస్తుంది. అంతేకాకుండా రక్షణ, సైన్స్ పరిశోధనలు, సమాచార ప్రసార రంగాలకు కూడా ఇది ఎంతగానో అక్కరకొస్తుంది.
గుత్తాధిపత్యం , భద్రతాపరమైన ముప్పులు..
అయితే స్టార్‌లింక్ సేవలను ఆహ్వానించడం మంచిదే అయినప్పటికీ, దేశీయ టెలికాం రంగాన్ని విదేశీ ప్రైవేట్ సంస్థ గుత్తాధిపత్యంలోకి నెట్టడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ పౌరుల సమగ్ర సమాచారం విదేశీ గడ్డకు చేరడం జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశముంది. గతంలో రష్యాతో యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్‌లో నెట్వర్క్ ధ్వంసమైనప్పుడు ఆ దేశ బలగాలు స్టార్‌లింక్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని అడ్డంపెట్టుకుని ఉక్రెయిన్‌లోని కీలక ఖనిజ నిల్వల్లో సగం భాగాన్ని ఇవ్వకపోతే సేవలు నిలిపివేస్తామని బెదిరింపులు వచ్చాయనే కథనాలు వెలువడ్డాయి. అలాగే ఇరాన్లో ప్రజల నిరసనల వేళ ప్రభుత్వం ఇంటర్నెట్ బంద్ చేసినా, స్టార్‌లింక్ ద్వారా ఆందోళనకారులు సమాచార మార్పిడి చేసుకున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లాంటి దేశంలో విదేశీ శాటిలైట్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవాలు గ్రహించండి మస్క్: జోహో శ్రీధర్ వెంబు చురకలు
ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత చవకగా ఇంటర్నెట్ డేటాను అందిస్తున్న దేశం భారత్ అని, వాస్తవాలను గుర్తించాలని మస్క్‌కు సూచించారు. దేశంలో ఏ ఒక్కరి గుత్తాధిపత్యాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం సహించదని, స్వదేశీ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ సమగ్ర పోటీతత్వాన్ని పెంచుతోందని తెలిపారు. అమెరికా మార్కెట్లో చైనా ఈవీ కార్ల రాకను అడ్డుకుని టెస్లాకు రక్షణ కల్పించడం వల్లే అక్కడ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. భారత ప్రభుత్వ విధానాల అండతోనే ఇక్కడి స్పేస్ స్టార్టప్‌లు అత్యంత తక్కువ ఖర్చుతో రాకెట్లను తయారుచేస్తూ పురోగమిస్తున్నాయని, అవి భవిష్యత్తులో స్పేస్ఎక్స్కు కూడా గట్టి పోటీగా మారనున్నాయని వెంబు పేర్కొన్నారు.
