గృహ హింసను అంతం చేయాలని, బాధితులకు అండగా నిలవాలని కోరుతూ కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్(Fremont) నగరంలో కమ్యూనిటీ సభ్యులు, గృహ హింస బాధితులు, సామాజిక కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన(Candlelight Vigil), వాక్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.
నాలుగు సంస్థల భాగస్వామ్యంతో…
డొమెస్టిక్ వయొలెన్స్ అవేర్నెస్ మంత్(Domestic Violence Awareness Month) సందర్భంగా మైత్రి (Maitri), నారిక (Narika), సేవ్ (SAVE – Safe Alternatives to Violent Environments), నిసా (NISA – North American Islamic Shelter for the Abused) అనే నాలుగు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఫ్రీమాంట్ హ్యూమన్ రిలేషన్స్ కమిషన్ దీనికి సహకారం అందించింది. ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్ ఈ నాలుగు సంస్థల నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు అందజేసి, అక్టోబర్ మాసాన్ని గృహ హింస అవగాహన మాసంగా ప్రకటించారు.
కార్యక్రమ విశేషాలు…
గృహ హింసను అంతం చేయాలని కోరుతూ ప్లకార్డులతో సాగిన కమ్యూనిటీ వాక్తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బాధితులు తమ అనుభవాలు, పోరాటాన్ని పంచుకుంటూ సమాజ మద్దతు గురించి వివరించారు. నృత్యం, సంగీతం, కవిత్వం, మెహందీ కళ ద్వారా భవిష్యత్తుపై ఆశలను వ్యక్తం చేశారు. చివరగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి బాధితులకు సంఘీభావం తెలిపారు.
గృహ హింస గణాంకాలు…
కాలిఫోర్నియాలో దాదాపు 35 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో జీవిత భాగస్వామితో హింసను ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. కాలిఫోర్నియాలో ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ హింసకు ఎక్కువగా గురవుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గృహ హింస కారణంగా ఏటా 8 మిలియన్ల పనిదినాలు నష్టపోవడంతో పాటు, వైద్య ఖర్చులు, ఉత్పాదకత తగ్గిపోవడం ద్వారా దాదాపు 8.3 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరుగుతోందని అంచనా వేశారు. గృహ హింసపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడానికి, బాధితులకు అండగా నిలవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
