కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోసే నగరంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కృష్ణ వృందావన ఆలయం(సుజ్ఞాన రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో) అత్యంత వైభవంగా నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి.మొదటి రోజు నుంచే వేద పండితులతో సంప్రదాయ అర్చాదికాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా, వైభవంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా రెండో రోజు భారత్ నుండి విచ్చేసిన ప్రఖ్యాత భరతనాట్య నూతన జంట స్నేహ నారాయణన్, యోగేష్ కుమార్ తమ అభినయ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హృద్యమైన సంగీతంతో పాటు వారి భావ వ్యక్తీకరణతో కూడిన నృత్య రీతులు విశేషంగా ఆకట్టుకున్నాయి.తమ హావభావాలతో, శాస్త్రీయ నాట్య నైపుణ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ జోడీ ప్రదర్శన ఈ వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక.. మూడో రోజు నార్త్ కాలిఫోర్నియాకు చెందిన యువ ప్రతిభావంతుల బృందం సంగీతం, నృత్యం చేశారు. ఇందులో భాగంగా సంప్రదాయ సంగీతాన్ని ఆలాపన చేశారు. ఈ కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.
శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు సఫల్య మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు నిర్వహించిన సంగీత కార్యక్రమాలు, బృంద ప్రదర్శనలు కూడా వైభవోపేతంగా జరిగాయి.

ఐదో రోజు శ్రీమతి సంధ్యా, సుబ్బరాము గారి శిష్యులు కూడా సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అద్భుతంగా సంగీత సేవలు అందించారు. శిష్యులందరూ కలిసి సంగీతాలాపన చేశారు.
