లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ నటించిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సంతోషకరమైన సమయంలో ఆయన ఐటెమ్ పాటల సంస్కృతిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
నటుడిగా తనకు కొన్ని సొంత నియమ నిబంధనలు ఉన్నాయని సిద్ధార్థ్ తెలిపారు. సమాజానికి చెడు సందేశాన్ని ఇచ్చే ఐటెమ్ సాంగ్స్‌లో తాను ఎప్పటికీ నటించనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒక మహిళ చుట్టూ చాలా మంది పురుషులు అసభ్యంగా ప్రవర్తించే పాటలను ప్రోత్సహించే విధానం తనది కాదని తేల్చిచెప్పారు.
అలాగే, తాను కేవలం హీరో పాత్రలకే పరిమితం కావాలని అనుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ హీరో పాత్రలోనే విపరీతమైన చెడు లక్షణాలు ఉంటే అలాంటి కథలను అస్సలు అంగీకరించనని తెలిపారు. అయితే, కథ డిమాండ్ చేస్తే సినిమాలో చివరికి నాశనమయ్యే క్రూరమైన విలన్ పాత్రలోనైనా నటించడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. నటుడిగా సమాజానికి మంచి సందేశం ఇవ్వడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
