ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka) గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఒకే పార్టుగా కాకుండా రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సినిమా కథా పరిధి చాలా పెద్దదిగా ఉండటంతో పాటు, భారీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు అట్లీ ఈ రెండు పార్టుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ ఆలోచనను అల్లు అర్జున్‌తో పాటు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ముందుంచగా, వారు కూడా సానుకూలంగా స్పందించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సంవత్సరం (2026) చివరి వరకు రెండు భాగాల షూటింగ్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత మేకర్స్ అధికారికంగా విడుదల తేదీలను ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డిజిటల్ రైట్స్‌కు సంబంధించి భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ, దర్శక నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘రాకా’ ప్రస్తుత షెడ్యూల్ పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు.
