తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడు రాజమౌళి బాటలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ప్రయాణిస్తున్నారు. ‘మగధీర’ వంటి భారీ విజయాల తర్వాత ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించి రాజమౌళి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. అదే విధంగా, ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కూడా ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి.. దీని తర్వాత ఓ యానిమేషన్ సినిమా చేయనున్నట్లు సమాచారం. రామాయణంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందనున్న ఈ పౌరాణిక చిత్రాన్ని కేవీఎన్ సంస్థ నిర్మించనుంది. పురాణ పాత్రలతో ఒక సినిమా చేయాలనే తన చిరకాల కోరికను ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన నెరవేర్చుకోబోతున్నారు.
ఈ యానిమేషన్ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా దర్శకులు స్క్రిప్ట్ మాత్రమే సిద్ధం చేస్తారు, కానీ అనిల్ రావిపూడి మాత్రం కేవలం స్క్రిప్ట్‌తో సరిపెట్టకుండా.. ప్రతి సన్నివేశాన్ని, డైలాగులను, పాత్రల హావభావాలను తానే స్వయంగా నటించి వీడియో రూపంలో రికార్డ్ చేశారట. ఆ విజువల్స్ ఆధారంగానే యానిమేటర్లు సీన్లను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా వరుస కమర్షియల్ హిట్స్ అందుకుంటున్న సమయంలో అనిల్ రావిపూడి ఇలాంటి వైవిధ్యమైన యానిమేషన్ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
