చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు తన్మయత్వంతో చిందులేసిన నాటి కుర్రాళ్ల నుంచి, జెన్‌జీ వరకు అందరినీ తన అద్భుతమైన నటన , అద్భుతమైన డ్యాన్సులతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తన 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా కళారంగానికి ఎనలేని సేవలందిస్తూ, పద్మవిభూషణ్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
చిరంజీవి అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తువచ్చేది ఆయన ప్రత్యేకమైన డ్యాన్స్. 90’s కిడ్స్‌కు రేడియోలు, టేప్ రికార్డర్లు, వాక్మ్యాన్ల కాలం నుంచి నేటి డిజిటల్ యుమం వరకు చిరు పాటలు వింటూ ఎంజాయ్ చేయడంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఫ్రెండ్స్ రీయూనియన్లలో ‘గ్యాంగ్ లీడర్’ నుంచి ‘అల్లరి ప్రియుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముఠా మేస్త్రి’, ‘హిట్లర్’, ‘బావగారు బాగున్నారా?’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి ఎన్నో చిత్రాలలోని సూపర్‌హిట్ పాటలకు స్టెప్పులేయని కుర్రాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.
మరోవైపు, ప్రస్తుత జెన్‌జీ తరాన్ని కూడా మెగాస్టార్ తన గ్రేస్‌తో అభిమానులుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్‌లో చిరు స్టెప్పులు, కవర్ సాంగ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. కాలేజీ వేడుకల్లో ‘ఖైదీ నంబర్ 150’ లోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’, ‘వాల్తేరు వీరయ్య’ లోని ‘పూనకాలు లోడింగ్’ పాటలతో పాటు రాబోయే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ‘మీసాల పిల్లా’ పాటకు కర్చీఫ్‌ను స్టైల్‌గా ఎగరేసే స్టెప్పులు జెన్‌జీకి విపరీతంగా నచ్చుతున్నాయి. ఎంత మంది కొత్త హీరోలొచ్చినా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతూ, యువతతో వైబ్ మ్యాచ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.
