మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడంతో, ఇది శబరిమల బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమానంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ.. ఈ సినిమాకు శబరిమలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ కథకు శబరిమలకు సంబంధం లేదని, సినిమాలో కథానాయకుడి జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష కేవలం ఒక భాగం మాత్రమేనని ఆయన తెలిపారు. వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి దీక్ష తీసుకున్నప్పుడు, మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. అక్కడే అసలైన సంఘర్షణ మొదలవుతుందని చెప్పారు. కథకు కఠినమైన నియమాలు అవసరం కాబట్టే ఈ దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు వెల్లడించారు.
ఈ 41 రోజుల ప్రయాణమే సినిమాకు స్క్రీన్ప్లే పరంగా ప్రధాన బలంగా నిలుస్తుందని, దీక్షకు ముందు ఏం జరిగింది.. ఆ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే ఉత్కంఠ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శివ నిర్వాణ పేర్కొన్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
