ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ (Spirit) సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ స్పష్టతనిచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అనుకున్న సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు.
నిర్మాతల స్పష్టత..
‘స్పిరిట్’ సినిమా విడుదలకు సంబంధించి ఎటువంటి మార్పులూ లేవని, ప్రణాళిక ప్రకారమే పనులు జరుగుతున్నాయని చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. షూటింగ్ ఆలస్యం అవుతోందనే వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది.
సినిమా విశేషాలు..
ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీసు కథతో పాటు మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను కూడా ఈ చిత్రంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ , సీనియర్ నటి కాంచన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ బడ్జెట్‌తో తొమ్మిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
