టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకున్న ‘బఘీరా’ అనే పెంపుడు కుక్క కన్నుమూసింది. గత నాలుగేళ్లుగా తనతో కలిసి ఉన్న బఘీరాతో దిగిన కొన్ని మధుర జ్ఞాపకాలను ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
బఘీరా తమ జీవితంలోకి కేవలం ఒక పెట్గా వచ్చినా, క్రమేణా కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయిందని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. దాని ప్రేమ, విశ్వాసం, అల్లరిని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. “నీవు లేని లోటు నా మనసులో ఎప్పటికీ పూడ్చలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది” అంటూ ఆయన రాసుకొచ్చిన భావోద్వేగ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.
మొక్క నాటిన తారక్..
బఘీరా మరణం తర్వాత తారక్ స్వయంగా దానిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో ఒక చిన్న మొక్కను నాటారు. తన జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కుడి చేతికి కట్టుతో ఉన్నప్పటికీ, బఘీరా పట్ల ఆయన చూపిన ప్రేమ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
కష్టకాలంలో దెబ్బ మీద దెబ్బ..
ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం గాయంతో బాధపడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు గాయం కావడంతో, ఇటీవలే ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఈ సమయంలోనే తనకు ఇష్టమైన పెట్ డాగ్ దూరమవ్వడం తారక్‌కు తీరని లోటుగా మారింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
