నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ, క్రమంగా పుంజుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఘన విజయం సాధించింది. సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగిపోయింది.
ఈ విజయంతో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నటుడు సంపూర్ణేష్ బాబుతో పాటు గీత రచయిత కాసర్ల శ్యామ్ మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హీరో నాని, వారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేడారంతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజులను కూడా వారు దర్శించుకున్నారు. అంతకుముందు ములుగు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ గట్టమ్మ దేవస్థానాన్ని కూడా చిత్రయూనిట్ సందర్శించి ఆశీస్సులు తీసుకుంది.
ఇదిలాఉంటే, ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మేడారంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సినిమాకు మొదట ‘సమ్మక్క’ అనే టైటిల్నే పరిశీలించారు. కథలో భాగంగా హీరో తల్లి పాత్ర పేరు సమ్మక్క కావడం, ఆ పాత్ర జాతి హక్కుల కోసం పోరాటం చేయడంతో ఈ పేరు పెట్టాలని భావించారు. అయితే తర్వాతి కాలంలో టైటిల్ మార్చి ‘ది ప్యారడైజ్’గా ఖరారు చేశారు. టైటిల్ మారినప్పటికీ సినిమాలో సమ్మక్క పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సినిమా ఘన విజయం సాధించడంతో చిత్రయూనిట్ ఇలా అమ్మవార్లను దర్శించుకుని కృతజ్ఞతలు తెలిపింది.
