పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘ఓజీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, పవన్ అభిమానులను మాత్రం బాగా సంతృప్తిపరిచింది. కథ విషయంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, టెక్నికల్గా మాత్రం ఈ మూవీ ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితమే ‘ఓజీ 2’ కూడా ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా కథ విషయంలో దర్శకుడు సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు, మొదటి భాగంలో ప్లస్ అయిన అంశాలను ఇందులో మరింత మెరుగ్గా చూపించేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట నవంబర్ నుంచి ‘ఓజీ 2’ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు.
షూటింగ్పై క్లారిటీ..
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్కు గాయం కావడంతో షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమై, అభిమానుల్లో మళ్లీ కొంత నిరుత్సాహం నెలకొంది. కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఎలాంటి మార్పులు లేకుండా మొదట అనుకున్నట్లుగానే ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా దర్శకుడు సుజిత్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
సుజిత్ సమాంతర ప్రణాళిక..
ప్రస్తుతం సుజిత్ నానితో ‘బ్లడీ రోమియో’ చిత్రానికి కమిట్ అయ్యాడు. ఆ సినిమాతో పాటు ‘ఓజీ 2’ను కూడా సమాంతరంగా తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పవన్ అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
