టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేపుతున్న కాంబినేషన్లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దర్శకుడు హను రాఘవపూడి జోడీ ఒకటి. ప్రభాస్ రేంజ్‌కు తగినట్లుగా హను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై చర్చ కేవలం ప్రభాస్ స్టార్డమ్ గురించే కాకుండా, హను రాఘవపూడి తన మార్కెట్ స్టైల్‌ను ఏ విధంగా మలచుకుంటారనే దానిపైనే ఎక్కువగా జరుగుతోంది.
‘అందాల రాక్షసి’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’, ‘సీతారామం’ వంటి సినిమాలతో సెన్సిబుల్ లవ్ స్టోరీలు, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు హను. కథను నెమ్మదిగా నడిపించినప్పటికీ, క్లైమాక్స్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం ఆయన శైలి. అయితే ఇప్పుడు ప్రభాస్ లాంటి భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తున్న తరుణంలో.. హను తన శైలిని పూర్తిగా మార్చుకున్నారా లేక తనదైన టేకింగ్‌ను కంటిన్యూ చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రభాస్ సినిమాల నుంచి ఫ్యాన్స్ భారీ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆశిస్తుంటారు. అదే సమయంలో హను నుంచి బలమైన కథ, ఎమోషన్స్‌ను కోరుకుంటారు. ఈ రెండు విభిన్న అంశాలను బ్యాలెన్స్ చేయడమే ‘ఫౌజీ’ చిత్రానికి అసలైన కీలకం. కేవలం ప్రభాస్ ఇమేజ్ కోసం మాత్రమే కాకుండా, తనదైన కథనాశైలిని జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే హను కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. ఈ సినిమా కనుక విజయం సాధిస్తే, హను మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది సినిమా విడుదల తర్వాతే తేలనున్నప్పటికీ, ఇది హను కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
