తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ :3/5
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ,ఈశ్వరీరావు, మదునందన్, లాల్, కిషోర్ కుమార్, కోట జయరాం తదితరులు
సంగీతం : అజయ్ – అతుల్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్ ఆర్
కొరియోగ్రఫీ : కృతి మహేశ్
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ : యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
రైటర్ : ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ : శివం రావు నాగసాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చెంబోలు సాయి ఆదిత్య
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
కో ప్రొడ్యూసర్స్: అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో : చెర్రి (చిరంజీవి)
సమర్పణ : గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ : నవీన్ యెర్నేని, రవిశంకర్
కథ, డైరెక్షన్ : రాహుల్ సంకృత్యన్
విడుదల తేది : 16.10.2026
నిడివి : 2 ఘంటల 58 నిముషాలు
1858 నాటి రాయలసీమ నేపథ్యాన్ని తీసుకుని బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఓ స్థానిక యోధుడు ‘రణబాలి’ జీవితకథను ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం పై విజయ్ దేవరకొండ,(Vijay Devarakonda) ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశల్ని పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ గా, ఆయన భార్య జయమ్మగా రష్మిక మందన్న (Rashmika Mandhanna), మమ్మీ చిత్ర ఫేం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ(Arnold Voslu) బ్రిటీష్ కమీషనర్ గా, నటించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 16) ధియేటర్ లలో విడుదల అయ్యింది. రాహుల్ సంకృత్యాన్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని నమోదు చేసింది. అప్పటికి వారి రేంజ్‌కి మించిన హిట్ లభించింది. అయితే మళ్లీ ఇంత గ్యాప్ తర్వాత ‘ రణబాలి ’ అంటూ ఆడియెన్స్ ముందుకు ఈ ఇద్దరూ వచ్చారు. అది కూడా బ్యూటీఫుల్ పెయిర్, రియల్ పెయిర్ విజయ్, రష్మిక కాంబోలో ‘రణబాలి’ రావడం మరో ప్రత్యేకం. మైత్రి మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రసిద్ధ ఆడియో సంస్థ టి సిరీస్(Mythri Movie Makers and T Series) సమర్పించారు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఏ మేరకు మెప్పించింది? అన్నది ఓ సారి చూద్దాం. అయితే.. ఒక రోజు ముందుగానే విజయ్ దేవరకొండ సినిమా యూఎస్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇంతకీ రణబాలి ఎలా ఉంది? విజయ్ తన పాత్రతో ఎంతవరకు మెప్పించాడు? సమీక్షలో చూద్దాం.
కథ:
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా కథ ను తీసుకోవడం జరిగింది. భద్ర మల్లన్న తాత ఆశీర్వాదంతోనే రాజమ్మ (ఈశ్వరీరావు) ‘సింగనమల బొబ్బిలి’ రణబాలి(విజయ్ దేవరకొండ)కి జన్మను ఇస్తుంది. పుట్టిన క్షణమే చావుని జయించి.. మళ్లీ పునర్జన్మను ఎత్తుతాడు రణబాలి. మొరటోడు, మొండోడు అయిన రణబాలి సింగనమల ప్రాంతానికి రెండు పుష్కరాల ఆయుష్షు మాత్రమే ఉండే రణబాలి ఆ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపు కాస్తుంటాడు. బ్రిటిష్ పాలకుల కఠినమైన పన్నుల విధానం, రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం, కరువు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కథకు ప్రధాన నేపథ్యంగా నిలుస్తాయి. బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురవుతున్న ప్రజల తరఫున నిలబడే స్థానిక యోధుడు సింగనమల బొబ్బిలి రణబాలి. ప్రజల బాధలను చూస్తూ ఊరుకోలేని రణబాలి.. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేస్తాడు. ఇక చావు ఘడియలు దగ్గరకు వచ్చాయని త్వరగా రణబాలికి పెళ్లి చేయాలని రాజమ్మ అనుకుంటుంది. జయమ్మ (రష్మిక మందన్నా)తో రణబాలికి వివాహాం జరుగుతుంది. అదే సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆగడాలు మితి మీరుతుంటాయి. కొత్తగా వచ్చిన కరువు రాక్షసుడు.. కమిషనర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డో వోస్లో) రాయలసీమ ప్రాంతంలో పండిన పంట ను తన దేశానికి ఎగుమతి చేసే బాగంలో పన్నుల మీద పన్నులు విధించి, వున్నా కాస్త ధాన్యం కూడా దౌర్జన్యం చేసి లాకుంటాడు. కరువు కాటకాలతో లక్షల మంది చనిపోతుంటారు. ఇదే ఆసరాగా తన దేశానికి ధాన్యం ఎగుమతి చేయడానికి రవాణా వ్యవస్త లేని కారణంగా రాయలసీమ ప్రాంతంనుండి మద్రాస్ పోర్ట్ కు రైల్వే లైన్ వేయడానికి ఆకలి తో వున్నప్రజలకు సగం కడుపుతో తిండి పెట్టి వారిని కూలీలుగా మారుస్తాడు. ఈ ఆకలి చావులు చూసి బ్రిటీష్ ఆధీనంలో ఉన్న ఆ ధాన్యాన్ని ప్రజలకు పంచి పెట్టేందుకు రణబాలి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత రణబాలి చేసిన పోరాటం ఏంటి? ఈ ప్రయాణంలో రణబాలి కోసం జయమ్మ చేసిన త్యాగం ఏంటి? భద్ర మల్లన్న ఇచ్చిన ఆయుష్షుని చివరకు తీసుకుంటాడా? కరువు రాక్షసుడ్ని ఈ రణబాలి అంతం చేస్తాడా? లేదా? అన్నది మిగతా కథ.
నటీ నటుల హవాబావాలు:
‘సింగనమల బొబ్బిలి’ రణబాలి పాత్ర విజయ్ దేవరకొండ కెరీర్లో పాత్ర ఓ మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎక్కువగా అర్బన్, మాస్, రొమాంటిక్ పాత్రల్లో కనిపించిన విజయ్. ఈ సినిమాలో పీరియడ్ క్యారెక్టర్లో కనిపించాడు. పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడంతో పాటు రౌద్రంగా కనిపించాల్సిన సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు పెద్ద ప్లస్. అతడు తెరపై కనిపించిన ప్రతిసారి సన్నివేశానికి ఒక ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో విజయ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ కంటే అతడి పేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ప్రజల కోసం పోరాడే యోధుడిగా విజయ్ పాత్రలో రౌద్రం, బాధ, భావోద్వేగం వంటి పలు షేడ్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విజయ్ నటన ప్రేక్షకులకు గూస్బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. జయమ్మ పాత్రలో రష్మిక మందన్న తనదైన శైలిలో ఆకట్టుకుంది. విజయ్‌తో ఆమెకు ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఇద్దరూ కలిసి కనిపించే సన్నివేశాలు కథలోని తీవ్రత మధ్య మంచి రిలీఫ్‌ను అందిస్తాయి. రష్మిక పాత్రను కేవలం గ్లామర్‌కు పరిమితం చేయకుండా కథలో భాగంగా తీర్చిదిద్దారు. జయమ్మగా ఆమె నటనలో ఎమోషన్ కనిపిస్తుంది. విజయ్, రష్మిక కలిసి కనిపించే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌ను తెరపై చూడటం చాలా కాలం తర్వాత మంచి అనుభూతిని ఇచ్చిందనే చెప్పొచ్చు. బిట్రీష్ ఆఫీసర్లుగా నటించిన వారు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ బాగానే నటించారు. ఈశ్వరీరావు, మదునందన్, లాల్, కిషోర్ కుమార్, కోట జయరాం వంటి వారి తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఈ సినిమాకి టెక్నికల్ టీం అతి పెద్ద బలం. రాహుల్ సాంకృత్యాన్ కథను ఎంచుకున్న విధానం ఆసక్తికరంగా ఉంది. 19వ శతాబ్దపు రాయలసీమను నేపథ్యంగా తీసుకుని అప్పటి సామాజిక పరిస్థితులను, బ్రిటిష్ పాలనలో ప్రజల కష్టాలను, తిరుగుబాటును తెరపై చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడి శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వాతావరణం, ప్రజల జీవన విధానం, బ్రిటిష్ పాలనకు సంబంధించిన అంశాలను కథలోకి తీసుకొచ్చారు. వార్ సీన్లను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా డాక్యుమెంటరీ అన్న ఫీలింగ్ కలిగించలేదు.
చాలా వరకు లిబర్టీస్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అయితే కథను చెప్పే విధానంలో కొన్ని సమస్యలు కనిపించాయి. దర్శకుడి ఆలోచన పెద్దదే అయినప్పటికీ స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కథనం కొంత నత్తనడకన సాగుతుంది. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను కాస్త కుదించి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేదేమో? కాస్ట్యూమ్స్ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తాయి.డైలాగ్స్ మరీ అంత గొప్పగా అనిపించవు. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 19వ శతాబ్దపు రాయలసీమ వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడంలో కెమెరా వర్క్ కీలక పాత్ర పోషించింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అప్పటి కాలాన్ని ప్రతిబింబించే సెట్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ సినిమాకు మంచి పీరియడ్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. విజువల్స్ విషయంలో దర్శకుడి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. సంగీతం విషయానికి.. పాటల్లో కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇలాంటి భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక మైన అంశం ఈ విషయం లో అజయ్ – అతుల్ బాగా కష్ట పడ్డారని తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ఎక్కడా వెనకాడకుండా సినిమా హై లెవల్లో ఖర్చు పెట్టారని తెలుస్తోంది.
విశ్లేషణ :
‘రణబాలి’ కొత్త కథ ఏమీ కనిపించదు. టీజర్, ట్రైలర్లోనే కథ దాదాపుగా జనానికి తెలిసిపోయింది. ముఖ్యంగా మన ఊహకందేలా కథ సాగుతూ ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ కలగదు. అలా పూర్తి స్థాయిలో మెప్పించే చిత్రంగా మల్చడంతో రాహుల్ సంకృత్యాన్ వంద శాతం సక్సెస్ అవ్వలేదనిపిస్తుంది. బ్రిటీష్ వారి అణచివేత. ఒక యోధుడు తిరుగబాటు చేయడం. చివరకు అంతమొందించడం అన్నది కథ. ఇలాంటి కథల్ని మన భారతీయ భాషల్లో చూసేసి ఉన్నాం.
రీసెంట్ టైంలో అంటే మనం ‘సైరా’ని చూశాం. అందుకే మనకు ‘రణబాలి’ కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ రాహుల్ సంకృత్యాన్ విజన్, మేకింగ్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. ఆయన మేకింగ్ బాగున్నా.. స్లో నెరేషన్, దాదాపు 2 గంటల 58 నిమిషాల నిడివి ప్రేక్షకుల సహనాన్ని కొన్ని చోట్ల పరీక్షిస్తుంది. కథలో పెద్దగా అవసరం లేని కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. స్క్రీన్‌ప్లే కూడా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ఫైనల్‌గా.. భారీ అంచనాలతో వచ్చిన ఈ పిరియదికల్ మూవీ మనల్ని 19వ శతాబ్దపు రాయలసీమ లోకి తెసుకేలుతుంది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, విజువల్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ కోసం థియేటర్లో చూడాల్సిన సినిమా.
