బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలెంటెడ్ నటి సాయి పల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇంగ్లిష్ వెర్షన్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందీ వెర్షన్‌తో పోలిస్తే ఇంగ్లిష్ వెర్షన్ నిడివి దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉండనుందని టాక్ నడుస్తోంది.
విదేశీ ప్రేక్షకుల కోసం కీలక మార్పులు..
విదేశీ ఆడియన్స్ అభిరుచి, టేస్ట్‌కు తగ్గట్టుగానే ఇంగ్లిష్ వెర్షన్లో పలు ప్రత్యేక మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అక్కడ విడుదలయ్యే వెర్షన్లో అసలు పాటలే ఉండవని, అలాగే కొన్ని కీలక సన్నివేశాలకు కూడా కత్తెర వేసినట్లు తెలుస్తోంది. మన దేశంలో ప్రేక్షకులు మూడు గంటలకు పైగా ఉండే సినిమాలను, మధ్యలో వచ్చే పాటలను ఎంతగానో ఇష్టపడతారు. కానీ, అంతర్జాతీయ ప్రేక్షకులకు ఆ రకమైన శైలి అంతగా నట్టకపోవచ్చనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
భారీ తారాగణం..
ఇటీసలే వినాయక చవితి సందర్భంగా విడుదలైన ‘జయ జయ రామ్’ తొలి పాట ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ గాత్రం అందించారు. ఈ మైథలాజికల్ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘రామాయణ- పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది.
