మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ కథానాయికగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఇరుముడి’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది.
అయితే ఈ వారం రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదల కావడంతో, ‘ఇరుముడి’ వసూళ్లపై దీని ప్రభావం పడుతుందని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా ‘ఇరుముడి’ తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా బుక్‌మైషోలో ఈ రెండు సినిమాల వీకెండ్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ‘టాక్సిక్’ చిత్రానికి 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతుండగా, అంతకుముందే విడుదలైన ‘ఇరుముడి’కి మాత్రం ఏకంగా 23 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి.
కొత్తగా వచ్చిన పాన్ ఇండియా సినిమాను సైతం వెనక్కి నెట్టి, పరిమిత థియేటర్లలోనే రీజనల్ సినిమా ఈ స్థాయిలో దూసుకెళ్లడం రవితేజ మాస్ క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తోంది. ఇదే ఊపు రాబోయే రోజుల్లోనూ కొనసాగితే ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
